HYDRA Commissioner A.V. Ranganath Launches Week-Long Training for Yuva Apada Mitra Volunteers : యువ ఆపద మిత్రులతో ఆపన్నహస్తం.
ఫతుల్‌గూడలో వారం రోజుల శిక్షణను ప్రారంభించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
సమాజం పట్ల బాధ్యత, పరుల పట్ల మానవీయత ఉన్నప్పుడే మన జీవితం సార్థకతను పొందుతుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అన్నారు. “పరుల కొరకు పాటుపడని నరుడి బతుకు దేనికని” అనే ప్రముఖ కవి సి.నా.రె. గారి వాక్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇతరుల కోసం జీవించడమే మానవ జీవితానికి నిజమైన అర్థమని వివరించారు.
ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించాలనే లక్ష్యంతో యువ ఆపద మిత్ర పథకం కింద ఎంపికైన వాలంటీర్లకు హైడ్రా ఆధ్వర్యంలో ఫతుల్‌గూడలో ఏర్పాటు చేసిన వారం రోజుల శిక్షణా కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమతో పాటు చుట్టుపక్కల ఉన్నవారి భద్రత గురించి ఆలోచించే మనస్తత్వం యువతలో పెరగాలని ఆకాంక్షించారు.
— యువ ఆపద మిత్రులతో ఆపన్నహస్తం
— HYDRAA (@Comm_HYDRAA) December 17, 2025
— వారం రోజుల శిక్షణను ప్రారంభించిన హైడ్రా కమిషనర్
✳️ నేను.. నా వాళ్లతో పాటు.. చుట్టు పక్కల ఉన్న వాళ్ల గురించి ఆలోచించినప్పుడే మన జీవితానికి సార్ధకత ఉంటుందని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ అన్నారు. "పరుల కొరకు పాటుపడని… pic.twitter.com/bIoxfH3AO9
మన రెండు చేతుల్లో ఒకటి మన అభివృద్ధికి, మరొకటి పరులకు చేయూత అందించేందుకు ఉపయోగపడాలన్నారు. వ్యక్తిగతంగా ఎదగడమే కాకుండా, సమాజానికి ఉపయోగపడే విధంగా సేవా దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఏ విధంగా స్పందించాలి, ఎలా రక్షణ చర్యలు చేపట్టాలి అనే అంశాలపై ఈ శిక్షణలో సమగ్ర అవగాహన కల్పిస్తారని తెలిపారు.
శిక్షణలో నేర్చుకున్న విషయాలను తమ పరిసరాల్లోని మరింత మందికి తెలియజేసి, అవగాహన పెంపొందించడంలో యువత కీలక పాత్ర పోషించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే పరిసరాలపై పూర్తి అవగాహన అవసరమని అన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు హైడ్రా కార్యకలాపాలపై అడిగిన ప్రశ్నలకు కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. చెరువుల పునరుద్ధరణ, ప్రజావసరాలకు కేటాయించిన స్థలాలు, పార్కుల పరిరక్షణలో హైడ్రా చేస్తున్న కృషిని విద్యార్థులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో హైడ్రా అడ్మిన్ ఎస్పీ శ్రీ ఆర్. సుదర్శన్, అడిషనల్ డైరెక్టర్ శ్రీ వర్ల పాపయ్య, ఎన్‌డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ శ్రీ దామోదర్ సింగ్, మై భారత్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ గంటా రాజేష్, హైడ్రా ఆర్‌ఎఫ్‌వో శ్రీ జయప్రకాశ్, డీఎప్‌వోలు శ్రీ యజ్ఞ నారాయణ, శ్రీ గౌతమ్ తదితరులు పాల్గొని యువ ఆపద మిత్ర వాలంటీర్లకు విలువైన సూచనలు చేశారు.
వారం రోజుల శిక్షణ వివరాలను హైడ్రా ఏడీఆర్‌ఎఫ్‌వో శ్రీ డి. మోహన్‌రావు వివరించారు. కమిషనర్ సూచనల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలను కూడా శిక్షణలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు

